ఈ ప్రపంచమంతా పాపాంధకారంతో నిండిపోయి ఆత్మీయ గుడ్డితనంతో చీకటిలో పయనిస్తోంది. దాని గమ్యం అగమ్యగోచరం! ఎటువైపు అడుగులు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి! దీనికంతటికీ కారణం మనిషి హృదయం. ఈ హృదయం వెలిగించబడితేనే గాని మానవుడు సరైన మార్గంలో నడవలేడు. అందుకు అవసరమగు సాధనమే క్రీస్తు అనుచరుడు. క్రీస్తును కలిగియున్న ప్రతి క్రైస్తవుడు అజ్ఞానపు అంధకారంలో జీవిస్తున్న ఈ సమాజానికి సుజ్ఞాన వెలుగు దీపమై ఉన్నాడు. క్రీస్తు అనుచరులు ప్రతిచోట కారు చీకటిలో కాంతి దీపమై ప్రకాశించాలని క్రీస్తు వారి హృదయాలను వెలిగించి జీవితాలను కాంతిమయం చేసాడు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్ చదువుచున్న విద్యార్థులను వారి ప్రొఫెసర్ ఒక పని చేయమన్నాడు. మీరు మురికివాడలకు వెళ్లి అక్కడున్న 16 సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన 200 మంది పిల్లల వివరాలను, వారి స్థితిగతులను తెలుసుకొని వారు పెరిగి పెద్దవారయ్యాక ఏమవుతారో ఊహించండి అని చెప్పాడు. తర్వాత ఆ విద్యార్థులు ఒక మురికివాడలోని 200 మంది పిల్లల వివరాలు సేకరించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి, సాంఘిక జీవన విధానాన్ని పరిశీలించి ఒక నివేదికను సమర్పించారు. దాని ప్రకారం ఆ పిల్లల్లో 180 మంది పెద్దవారయ్యాక జైలులో జీవిస్తారని ఆ విద్యార్థుల బృందం ఊహించింది.
25 సంవత్సరాల తర్వాత మరొక కాలేజీ విద్యార్థి బృందం పై నివేదిక ఎంతవరకు నిజమైనదో పరిశీలించడానికి పంపబడ్డారు. వారు అదే ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా ఆ రెండు వందల మందిలో కొంతమంది అక్కడే నివసిస్తున్నారు, కొందరు వేరొక ప్రాంతాల్లో ఉంటున్నారు, ఇంకొందరు మరణించారు. అయితే జైలులో జీవిస్తారని ఊహించిన వారిలో కేవలం నలుగురు మాత్రమే జైలు పాలయ్యారు. మిగిలిన వారంతా మంచి ప్రయోజకులు అయ్యారని తెలుసుకున్నారు.
నేరాలు ఘోరాలు చేసి జైలు పాలవుతూ సమాజం చేత చీదరించ బడుచున్న ఆ మురికివాడల్లోని బాలలు ఇంతటి ప్రయోజకులు ఎలా మారారని మళ్లీ పరిశీలించారు. ఆ పరిశోధనలో 75 శాతం మంది ఇచ్చిన సమాధానం ఏమంటే మా ఊరిలో ఒక క్రైస్తవ టీచరు పని చేసేవారు. ఆమె క్రీస్తు ప్రేమను మా పట్ల చూపించి, పాఠాలు చెప్పేవారు. అందుచేత ఆమె ప్రభావం వలన మేమందరం నేరం చేయకుండా మంచిగా బ్రతకాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. అవును క్రీస్తు అనుచరులు ఎక్కడ ఉన్నా క్రీస్తు వెలుగును తప్పక ప్రసరింప చేస్తారు. వారిలోనున్న కాంతిని ఎవరూ మరుగుచేయలేరు. ఇలాంటి కాంతినిచ్చే దీపాలుగా ఉండడానికి కారణం క్రీస్తే. ఆనాడు యేసు అన్నాడు “మీరు లోకమునకు వెలుగైయున్నారు”. ఇది ఎంత గొప్ప ఆదిక్యత! ఇది మనం పొందుకున్నది కాదు. ఆయన కృప ద్వారా అను గ్రహించబడింది.
“మరల యేసు – నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను”. (యోహాను 8:12) స్వభావసిద్ధంగా ఏ మనిషిలో కూడా వెలుగు లేదు. మనిషి హృదయం దట్టమైన చీకటితో నిండిపోయింది. కావున ఒక మనిషి మరో మనిషిని వెలిగించలేడు. ఎందుకంటే ప్రతి మనిషి లోకము యొక్క చీకటితో నిండి పోయాడు. ఇటువంటి ప్రపంచానికి క్రీస్తు శాశ్వత వెలుగుగా ఉన్నాడు. సహజంగా చంద్రుడు మీద సూర్యుని కిరణాలు పడినప్పుడు చంద్రుడు ప్రకాశించినట్లుగా క్రీస్తు అనుచరులు క్రీస్తు తెలుగు వారి మీద పడినప్పుడే వారు దేదీప్యమానంగా ప్రకాశించగలరు.
క్రీస్తు విశ్వాసుల యొక్క వెలుగుకు మూలమైయున్నాడు. విశ్వాసులు ఆ వెలుగులో నడవాలి. నిత్యం ఆ వెలుగుతో నింపడాలి. “మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచిడి” (యోహాను 12:36) క్రీస్తు అనుచరులు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే ఒక విశ్వాసి అన్యొన్య సహవాసం కలిగి ఉండగలడు. (1యోహాను 1:7) “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి”. (ఎఫెసీ. 5:8-10)
“మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు”. (మత్తయి 5:14-15) ప్రపంచమంతా అంధకారంలో ఉంది అయితే క్రీస్తు అనుచరులు క్రీస్తు వెలుగును ప్రసరింపచేసే దీపాలుగా ఉన్నారు. కాంతినిచ్చే దీపం అన్నిటికంటే పైన ఉంచబడుతుంది. అదేవిధంగా ఒక క్రైస్తవ విశ్వాసి వెలుగునిచ్చే దీపంలా ఉన్నత స్థానంలో కనిపిస్తున్నాడు. కాబట్టి వారు ఎక్కడ ఉంటే అక్కడున్న సమాజానికి వెలుగుమయంగా ఉంటారు. కొండమీద పట్టణం ఎలాగైతే అందరికీ కనిపిస్తుందో అలాగే విశ్వాసులులో ఉన్న కాంతి రహస్యంగా ఉండక అది అందరికీ కనిపిస్తుంది.
వెలుగే దీపం లోపల ఉన్నా, బయట ఉన్నా అది తన కాంతిని ప్రసరించునట్లుగా విశ్వాసి ఎక్కడున్నా తన స్థానాన్ని మర్చిపోకూడదు. దీపం ఇంటిలో ఉన్నవారందరికీ వెలుగునిస్తుంది. ఇలాంటి దీపం ప్రతి ఇంట్లో ఉంటే దీపాలు తోరణాలుగా వారున్న పట్టణమే ఒక ప్రకాశవంతంగా కాంతులీనుతుంది. దీపం ఇంటి లోపల వెలుగునిస్తుంది, పట్టణం దట్టమైన చీకటి ప్రాంతానికి వెలుగునిస్తుంది. ఇవి రహస్యంగా ఉండవు కానీ ప్రత్యేకంగా ఉండాలి. “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? (2 కోరింథీ.6:14)
“మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి”. (మత్తయి 5:16) క్రీస్తు విశ్వాసులలోని వెలుగు దేవునిదే గనుక దేవునికి మహిమ కలిగేలా జీవించాలి. మనుష్యుల ఎదుట మంచి పనులు చేయాలి, అయితే అది మనుషుల చేత మెప్పు పొందడానికి కాకూడదు. అది దేవుని ఘనతకు మాత్రమే కారణం అవ్వాలి. క్రీస్తు అనుచరులు అంధకారంలో ఉన్న అనేకులను దేవుని వద్దకు నడిపించే మార్గదర్శకులుగా ఉండాలి. విశ్వాసుల వెలుగు చీకటిలో ఉన్న వారికి దేవుని మార్గాన్ని చూపించే వెలిగే దీపాలుగా ఉండాలి. “పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” (సామెత 4:18)
క్రీస్తు అనుచరులు మనుషుల కొరకు మంచి పనులు చేయాలి అవి ప్రయోజనకరమైనవిగా ఉండాలి. క్రైస్తవుని కాంతి అనే మంచితనం ఇతరుల సంస్కరణకు, హృదయ మార్పుకు కారణం అవ్వాలి. క్రీస్తు అనుచరులు అజ్ఞాన సమాజానికి వెలుతురునిచ్చే దీపంలా అంధకార బంధురమైన ప్రపంచానికి వెలుగునిచ్చే జ్యోతిలా ప్రకాశించాలి. అందుకే దేవుడు మనలను పిలిచాడు. “అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు”. (1పేతురు 2:9)
ముగింపు: ప్రియులారా పై మాటలు చదువుచున్నప్పుడు ఇవి కేవలం ఆనాటి ఆదిమ సంఘ అపోస్తులలకు లేక సంఘంలోని విశ్వాసులకు మాత్రమే చెందినవి కావు. ఈ సందేశం ఈనాటి మనకు కూడా వర్తిస్తుంది. వెలుగులో అన్ని రంగులు కనిపించినట్లుగా మనలోని మంచి సుగుణాలనే దివ్య లక్షణాలు విరాజిల్లాలి. బైబిలులోని భక్తులు క్రీస్తు కొరకు లోకంలో ప్రకాశించే జ్యోతులుగా జీవించారు. యోబు దేవునియందు భయభక్తులు కలిగి మంచి క్రియలు చేత దేవుని కొరకు వెలుగొందాడు. (యోబు 29:1-11) బాప్తిస్మమిచ్చు యోహాను మండుచున్న దీపమువలె ప్రకాశించాడు (యోహాను 5:35) అపొస్తులుడైన పౌలు అన్యులకు క్రీస్తు సువార్త ప్రకటించుట ద్వారా చీకటిలో నుండి వెలుగులోకి, సాతాను అధికారంలో నుండి సృష్టికర్తయైన దేవుని వైపుకు తిరిగి పాప క్షమాపణ, నిత్యమైన శ్వాస్థ్యం పొందడానికి వారి కన్నులు తెరువబడ్డాయి. (అపొ.26:18)
మనం క్రీస్తు వెలుగులో నడిస్తే మనలను చూస్తున్న చీకటిలోనున్న వ్యక్తులు వెలుగులోనికి నడిపించ పడతారు. మన దేశానికి స్వదేశీ విదేశీ క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది. వారు క్రీస్తు వెలుగును మనదేశంలో ప్రతిచోటా ప్రకాశింప చేశారు. మనువాద బ్రాహ్మణ ఆధిపత్యంలోనున్న మన భారతదేశంలో అనేక సాంఘిక దురాచారాలను, సామాజిక అసమానతలను రూపుమాపారు. సతీసహగమనం, జోగిణి లేక దేవదాసి సాంప్రదాయం, పసిపిల్లల నరబలులు నిషేదించ బడ్డాయి. శూద్ర వధువు మొదటి మూడు రాత్రులు బ్రాహ్మణనుతో గడుపుట మరియు కుల వ్యవస్థను కూలదోసి, బానిసత్వాన్ని నిర్మూలించి సామాజిక న్యాయం జరగడానికి వారెంతో కారకులయ్యారు.
క్రైస్తవ మిషనరీలు స్థాపించిన పాఠశాలలు, కళాశాలలు విశ్వవిద్యాలయాలను స్తాపించి, అజ్ఞానపు అంధకారంలో ఉన్న మన సమాజానికి విజ్ఞాన కాంతులు వెదజల్లారు. వాటిలో చదివిన మన భారతీయులందరో సామాజిక అభ్యున్నతికి దేశ ప్రగతికి పనికి వచ్చే సంఘసంస్కర్తలుగా మారారు. క్రైస్తవులు స్థాపించిన వైద్యశాలలో అనేక మంది రోగులకు ఊపిరి పోశారు. ఇలా వ్రాస్తూ వెళితే భారతదేశ చరిత్రలో వారు చేసిన సేవ, వారు నింపిన స్ఫూర్తి అద్వితీయం, నేటికి అనుసరణీయం. నేడు మనం అనుభవిస్తున్న అనేక విద్య, వైద్య, అభివృద్ధి ఫలాలు మిషనరీల త్యాగ వలన కలిగినవే. కావున మనం కూడా వారి ప్రేరణతో క్రీస్తు అనుచరులుగా దేవుని కొరకు దేశం కొరకు ప్రకాశించుదాం “అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు”. (ఎఫెసీ. 5:14)